తెలంగాణ భవన్‌లో ‘బంగారు బతుకమ్మ’ పోస్టర్ ను టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించిన్రు. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లోనే కాకుండా సంస్కృతి, భాష మీద దాడి జరిగిందని కేసీఆర్ అన్నరు. ఆంధ్రోళ్లు తెలంగాణ భాషను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సీమాంధ్రులు మాట్లాడేదే తెలుగు అనుకుంటే అవివేకం. మనం తిట్టుకునే పదాలు ఆంధ్రోళ్లు సంతోషంగా మాట్లాడుకుంటరు. తెలుగు సినిమాల్లో జోకర్‌గాళ్లకు తెలంగాణ యాస. మనది తౌరక్యాంధ్రం అని ఆంధ్రోళ్లంటరు.
ఉర్దూ పుట్టింది తెలంగాణలోనే. ఉర్దూ, తెలుగు చెట్టాపట్టాలేసుకుని నడయాడిన గడ్డ తెలంగాణ. జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరారీ అనే పదంలో అన్నీ ఉర్దూ పదాలే. జైలు ఉర్దూ పదమే. ఖైదీ ఉర్దూ పదమే. పరారీ ఉర్దూ పదమే. ఆంధ్రోళ్లు బస్సు అనే ఆంగ్ల పదాన్ని తెలుగు అనుకుంటున్నారు. ఆంధ్రోళ్లు మజ్జిగను తెలుగు అనుకుంటున్నరు కానీ అది తమిళం. మనం చల్ల అంటాం. అసెంబ్లీలో ఉపయోగించే మూజువాణి అనే పదాన్ని ఆంధ్రోళ్లు తెలుగు అనుకుంటున్నరు కానీ అది ఉర్దూ పదం. తెలంగాణ సంస్కృతిపై దాడి జరగడంతో పండుగలకు దూరమైనం. సంస్కృతి, భాష మీద తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చింది. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటల్ని అలుపెరగకుండా పాడుతరు. చదవు, సాహిత్యంతో సంబంధం లేకుండా తెలంగాణలో ఎన్నో పాటలు వారసత్వంగా వచ్చినయి. రేపు తెలంగాణ రాష్ట్రంలో కల్చరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుందాం. తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనానికి తెలంగాణ జాగృతి ఎంతో పాటు పడుతుంది. బంగారు బతుకమ్మ పండుగ కార్యక్రమానికి నడుం బిగించిన తెలంగాణ జాగృతికి హృదయపూర్వక ధన్యావాదాలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు.